జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. పందుల వేట కోసం నిల్వ ఉంచిన బాంబు ప్రమాదవశాత్తు పేలడంతో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
స్థానికంగా దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోటారు సైకిల్లో పందుల వేట కోసం నాటు బాంబులు నిల్వ ఉంచారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో లక్ష్మయ్యతో పాటు మరో ఆరుగురు గాయపడ్డారు.
ఆసుపత్రికి తరలింపు
స్థానికులు వెంటనే క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నాటు బాంబుల నిల్వ, పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


