జక్రాన్‌పల్లి దళిత మహిళకు ఇప్పటికైనా న్యాయం జరిగేనా?

నిజామాబాద్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి గ్రామ దళిత మహిళ శ్రావంతి కుటుంబానికి గత ఆరు నెలలుగా ఎదురవుతున్న సామాజిక బహిష్కరణ అంశంపై చివరకు అధికారులు స్పందించారు. గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) పేరుతో ఈ కుటుంబాన్ని గ్రామస్తులు సామాజికంగా దూరం పెట్టి, ఒంటరిగా జీవించాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో దళిత నాయకులు బంగారు సాయిలు, రవి, MPJ నాయకులు షేక్ హుస్సేన్, డా. సజ్జాద్‌లు గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకుని స్థానిక పోలీసులకు వివరించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన SC/ST కమిషన్ చైర్మన్‌కు కూడా ఈ విషయం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.దీంతో గురువారం నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి స్వయంగా గ్రామానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని కలుసుకుని వారితో మాట్లాడారు. గ్రామస్థులతో విచారణ జరిపిన ఆయన, బాధిత మహిళకు న్యాయం చేస్తామంటూ, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రస్తుతం జిల్లాలో న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా పలు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, గ్రామ అభివృద్ధి కమిటీలు చట్ట విరుద్ధంగా ప్రవర్తించరాదని ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. దీనివల్ల శ్రావంతి లాంటి బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.అధికారుల చొరవతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంటున్నది. ‘‘ఇంతకాలం ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు పోలీసు అధికారుల, నాయకుల హామీతో కొంత ధైర్యం వచ్చింది’’ అని శ్రావంతి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!