నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) ప్రజా సమస్యలను దగ్గరనుండి తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ప్రాధాన్యతతో తీసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా హాజరై, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 217 ఫిర్యాదులు అందగా, వాటిని విభాగాల వారీగా పంపిణీ చేస్తూ, త్వరగా పరిష్కరించాలని సూచించారు. “ప్రజలు అధికారుల పై విశ్వాసం కలిగి ఉండాలంటే సమస్యల పరిష్కారం తక్షణమే జరగాలి. ప్రతి ఫిర్యాదుపై ట్రాక్ కొనసాగించి, నిర్ణీత గడువులో పరిష్కారం అందించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.అవ్యవస్థలు – అసౌకర్యాలతో నేలపై కూర్చున్న మహిళలు..ప్రజావాణి కార్యక్రమంలో కొన్ని సాంకేతిక లోపాలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. ప్రతి వారం కంటే ఈసారి ఎక్కువ మంది ఫిర్యాదుదారులు రావడంతో, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేసే సమయంలో సర్వర్ పనిచేయకపోవడం, దాంతో పాటు రసీదుల జారీ ఆలస్యం కావడం వల్ల ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా హాజరై ఉండగా, తగిన కుర్చీలు లేకపోవడంతో వారు నేలపై కూర్చోవాల్సి వచ్చింది. రసీదు కోసం మంగళవారం మళ్లీ రావాలంటూ సిబ్బంది చెప్పిన సమాధానంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు “కలెక్టర్ సమక్షంలో కార్యక్రమం బాగా జరిగింది కానీ మిగతా ఏర్పాట్లలో జాప్యం వల్ల మాకు ఇబ్బంది జరిగింది” అని వాపోయారు.ఈ విషయాలను కలెక్టరేట్ సిబ్బంది గమనించి, తగిన ఏర్పాట్లు ముందుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.