గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ జై భారత్ మే:23  గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. రాత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తన ఛాంబర్లో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా శాఖల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా రాత పరీక్ష జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 330 మంది అభ్యర్థులు గ్రామ పాలన అధికారుల నియామక రాత పరీక్షకు హాజరు కానున్నారని, వీరికి నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంట వరకు పరీక్ష కొనసాగుతుందని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హితవు పలికారు. పరీక్ష ప్రారంభం అయిన మీదట ఆలస్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ జరపాలని, నియమ నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులలో అభ్యర్థులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.ఈ  సమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా రవాణా అధికారి ఉమా మహేశ్వరరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, తహసిల్దార్ బాలరాజు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!