నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22
నిజామాబాద్ నగరంలోని కోర్టు చౌక్ వద్ద గురువారం ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్లాక్ ఫిల్మ్‌ల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలి, సీఐ ప్రసాద్ నాయకత్వంలో ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. అనుమతిలేని బ్లాక్ గ్లాస్ ఫిల్మ్‌లను కార్లపై గుర్తించి అక్కడికక్కడే తొలగించి, సంబంధిత వాహనదారులపై జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలపై బ్లాక్ ఫిల్మ్‌లు వాడకూడదు. ఎవరు తప్పు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.మైనర్ల చేత వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్, శబ్ద సైలెన్సర్ల వాడకం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.ట్రాఫిక్ శాఖ ప్రతిరోజూ ఇటువంటి స్పెషల్ డ్రైవ్‌లను కొనసాగిస్తుందని, వాహనదారులు నిబంధనలను గౌరవించి, రహదారులపై ప్రమాదాలు నివారించేలా సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.