నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21
మే 21: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే 21 నుంచి 28వ తేదీ వరకు “క్యాచప్ క్యాంపెయిన్” పేరుతో వ్యాధి నిరోధక టీకాల ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లల్లో టీకాలు మిస్సయినవారిని గుర్తించి ఉచితంగా టీకాలు వేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.ఈ మేరకు జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సమాచారం అందిస్తూ, మొత్తం 2569 మంది అర్హులైన పిల్లలను గుర్తించామని తెలిపారు. వీరిలో 1709 మంది ఒక సంవత్సరంలోపు వారు కాగా, ఐదు సంవత్సరాలు నిండినవారు 224 మంది ఉన్నారు. అదనంగా, 409 మంది గర్భిణీలను కూడా టీకాల కోసం గుర్తించామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 705 టీకా కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైరిస్క్ ప్రాంతాల్లో 12 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. పిల్లలను టీకా కేంద్రాలకు ఆశా కార్యకర్తలు తీసుకురావాలని సూచించగా, టీకాల వేయడంలో ఏఎన్ఎంలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి పర్యవేక్షణ కోసం జిల్లా ఉపవైద్యాధికారులు, వైద్య సిబ్బంది, డా. అశోక్ నేతృత్వంలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలియజేశారు.