నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19
●నకిలీ ఆర్డర్ కాపీతో బురిడీ కొట్టించిన వైనం
●న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
నిజామాబాద్ జిల్లా కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి తొమ్మిది లక్షలు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా కోర్టులో ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కాపీ సైతం బాధితురాలికి అందించి మోసం చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, సీపీ అందుబాటులో లేకపోవడంతో రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ మండలం లింగీ తాండకు చెందిన తేజవత్ పీరుకు దూరం బంధువు సిరికొండ మండలం, చీమన్పల్లి గ్రామంకు చెందిన మాలవత్ మోహన్ తాను గతంలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, వారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేసుకొంటూ మంచిగా సెటిల్ అయ్యారని, లేనిపోని మాటలు చెప్పడంతో అతని మాటలు నమ్మి పోస్టాఫీసులో, కోర్టులో ఉద్యోగాలు ఖాళీ ఉన్నవని, ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపినాడని ఆమె వాపోయారు. పోస్టాఫీసులో ఉద్యోగం కావాలంటే 4 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలుపడంతో, నేను డబ్బులు అప్పు రూపంలో తీసుకొని వచ్చి విడుతల వారీగా 4 లక్షల రూపాయలు మోహన్ కు అతని భార్య, కూతురు, కుమారునికి చెల్లించడం జరిగిందన్నారు. కానీ అతను రేపు, మాపు అంటూ వాయిదాలు పెడుతూ తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. చివరిగా నేను అతని వద్దకు వెళ్లి నాకు ఉద్యోగమైన ఇప్పించు లేదా నేను చెల్లించిన డబ్బులైనా తిరిగి చెల్లించాలని మాలవత్ మోహన్ ను కోరగా అతను నీకు పోస్టాఫీస్లో ఉద్యోగం వచ్చిందని ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాడని, అది ఫేక్ ఆర్డరని తేలడంతో నేను అతని వద్దకు వెళ్లి అడిగితే, అతను ఈవిషయం ఎవరికి చెప్పవద్దని, కోర్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందని అందులో ఇప్పిస్తానని నమ్మించాడని ఆమె తెలిపారు. కోర్టులో ఉద్యోగం కోసం మరో 5 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం గ్యారంటని చెప్పినట్లు తెలిపారు. ఇది వాస్తవమని భావించి మళ్లీ అక్కడ ఇక్కడ అప్పు రూపంలోతీసుకొని 5 లక్షల రూపాయలు విడతల వారీగా మాలవత్ మోహన్ భార్య, పిల్లలకు చెల్లించమన్నారు. దీంతో నాకు 2025 మార్చ్ నెలలో కోర్టులో జాబ్ వచ్చిందని చెప్పి, అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని అందించినట్లు ఆమె వెల్లడించారు. కోర్టులో మాలవత్ రాజు అనే వ్యక్తి నన్ను కోర్టు లోపలికి రెండవ ఫ్లోర్ కు తీసుకెళ్లి రిజిస్ట్రార్ తీసుకొనివచ్చి అందులో నా సంతకం తీసుకొని, రేపటి నుండి నీవు కోర్టులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలి చెప్పారన్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడవద్దని చెప్పడంతో, ఆ మాటలు విన్న తర్వాత నాకు అనుమానం వచ్చి, ఆ సర్టిఫికేట్ ఇతరులకు చూపించగా, అది ఫేకని తేలడంతో, నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, జాబ్ ఇప్పించకపోతే నేను చెల్లించిన డబ్బులు తిరిగి అప్పించారని కోరడంతో రేవు, మాపు అంటూ వాయిదాలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె అన్నారు. ఈనెల 17న నా భర్త ఫోన్ నుండి ఫోన్ చేస్తే మోహన్ అనే వ్యక్తి జాబ్ ఇప్పించను, డబ్బులు కూడా తిరిగి వాపసు ఇవ్వను, ఏమి చేసుకొంటావో చేసుకపో అని అసభ్యకరంగా బూతు మాటలు తిట్టడన్నారు. నాకు అప్పు ఇచ్చినవారు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని. మోహన్ వలన జాబ్ విషయంలో మోసపోవడంతో నేను మానసిక క్షోభకు గురి అవుతూ, ఆర్థికంగా నష్టపోయనన్నారు. నాకు మాయమాటలు చెప్పి, నమ్మించి నా వద్ద 9 లక్షల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడమే కాకుండా, నేను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే అతను నన్ను ఒక మహిళనని చూడకుండా బూతు మాటలు తిడుతూన్నాడని, ఈ విషయం ఎక్కడ ఫిర్యాదు చేసిన అంతు చూస్తానని బెదిరించినందున మాలవత్ మోహన్, మాలవత్ లవణ్య, మాలవత్ శ్రావణి, మాలవత్ శ్రావణ్ కుమార్, మాలవత్ రాజులపై చట్టరీత్య చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.