జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండుగ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 31 (షేక్ గౌస్)
నిజామాబాద్ జిల్లాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో, ముస్లింలు ఉత్సాహంగా జరుపుకోవడంతో జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం, ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ముస్లిం మత పెద్దలు సోమవారం ఈద్ పండుగను జరుపుకోవాలని ప్రకటించారు.జిల్లా కేంద్రం ఖిల్లా, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, నందిపేట్ వంటి ప్రాంతాల్లోని ఈద్గాలలో ఉదయం 7:00 గంటల నుండి 10:00 గంటల వరకు సామూహిక నమాజులు నిర్వహించబడ్డాయి. ముస్లిం సోదరులు తెల్లవారుజాము నుంచే ఈద్గా ప్రాంగణాలకు చేరుకుని, నమాజుకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రత్యేక దువాలు చేశారు.ఈద్ పండుగను పురస్కరించుకుని, ఈద్గా కమిటీలు, మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలకు హాజరయ్యే నామాజీలకు సౌకర్యంగా ఉండేందుకు శుభ్రత, తాగునీరు వంటి సౌకర్యాలు సమకూర్చారు. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, పండుగ శాంతియుతంగా జరగడానికి చర్యలు తీసుకున్నారు.
బాన్సువాడలో ఘనంగా పండుగ వేడుకలు…
బాన్సువాడ పట్టణంలో ఈద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) తెలిపారు. బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం, ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
నందిపేటలో ….
నందిపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఫేస్ ఇమామ్ (హఫీజేఖురాన్) ఆధ్వర్యంలో ఈద్గా ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నందిపేట్, డొంకేశ్వర్ మండల కేంద్రంతో పాటు ఖుదవందపూర్, అయిలపూర్ తదితర గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రత్యేక దువాలు చేసుకున్న ముస్లిం సోదరులు, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
మత సామరస్యానికి నిదర్శనం…
రంజాన్ పండగ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఈద్గాహలకు చేరుకుని ముస్లింలతో కలిసి సామూహిక నమాజ్ ఆచరించిన అనంతరం ముస్లింలతో ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గల గంగా-జమునా తహజీబ్‌ను ప్రతిబింబించేలా భిన్న మతాల ప్రజలు కలసి ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఐక్యంగా నమాజు చేసి, భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. ఇతర మతస్తులు కూడా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి మత సామరస్యాన్ని చాటారు.
మండల నాయకుల శుభాకాంక్షలు
నందిపేట్ మండలంలో పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మండ మహిపాల్, వుళ్ళి సుధాకర్ గౌడ్ ఈద్గాహ వద్ద ముస్లిం సోదరులతో కలిసి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండగ ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఈద్గాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!