నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10.
నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ తనకు నిజామాబాద్ సీపీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో రాజీపడేదే లేదని అన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. మహిళా భద్రతకు కూడా పెద్ద పీట వేస్తామని పేర్కొన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, అర్బన్, రురల్ అని తేడా లేకుండా అమాయకులు మోసపోతున్నారని, సైబర్ నేరాల నివారణకు పోలీస్ శాఖ తరపున అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత డ్రగ్స్, ఆన్ లైన్ బెట్టింగ్ కు వ్యసనపరులపై బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్, బెట్టింగ్ కట్టడికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ప్రజల సేవలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేసారు. కాగా, 2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సాయి చైతన్య గారు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బెనారస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను అభ్యసించారు.ప్రస్తుతం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ.. నిజామాబాద్ సీపీగా ఇటీవల బదిలీ అయ్యారు.గతంలో కటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు. ములుగు ఏఎస్పీగా ఉన్నప్పుడు తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ది చెందిన మేడారం జాతరల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.