నిజామాబాద్ ప్రతినిధి. జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 27.(షేక్ గౌస్)
శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
ప్రధాన శివాలయాల్లో విశేష పూజలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి ప్రారంభమై, గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆలయాలన్నింటిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడగా, “హర హర మహాదేవ్.. శంభో శంకర!” నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. పార్వతీ-పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండువగా సాగగా, భక్తులు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ఆలయం, ఆర్మూర్ సిద్దులగుట్ట శివాలయం, నందిపేట కేదారేశ్వర ఆలయం, భిక్కనూరు సిద్ధిరామేశ్వర ఆలయం, రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గరామేశ్వర ఆలయం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించారు.రామారెడ్డి మండలం మద్దికుంటలోని బుగ్గరామేశ్వర ఆలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నస్రులాబాద్ మండలం దుర్కిలోని సోమలింగేశ్వర ఆలయంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
నందిపేట కేదారేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
నందిపేట కేదారేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచే భక్తులు తరలి వచ్చి రుద్రాభిషేకం, లింగోద్భవ హారతుల్లో పాల్గొన్నారు. రాత్రి జరిగిన శివపార్వతుల కళ్యాణం, హరహర మహాదేవ్ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్ష అర్చనలు ఐదు రోజుల పాటు నిర్వహించి, భక్తులకు రుద్రాక్ష మాలలు అందజేశారు. గోదావరి తీరం వద్ద ఉన్న ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయంలో మహాలింగార్చన, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడ్డాయి.
రాత్రి జాగరణ – భక్తి కార్యక్రమాలు
శివరాత్రి నాడు జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు “ఓం నమః శివాయ” శ్లోకాలను జపిస్తూ, శివనామ సంకీర్తన చేశారు. వివిధ ఆలయాల్లో భజనలు, కోలాటాలు, పురాణ ప్రవచనాలు జరిగాయి. “హరహర మహాదేవ శంకరా! జయ జయ శంకరా!” అంటూ భక్తులు భక్తి మయంగా స్వామివారిని ఆరాధించారు.
అన్నదాన కార్యక్రమాలు
నందిపేట, ఆర్మూర్, ఉమ్మెడ, చేపూర్, పల్గుట్ట, డొంకేశ్వర్, నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన శివాలయాల్లో భక్తులకు పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం, చపాతీ వంటి ప్రసాదాలు అందజేశారు.
భద్రతా ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లతో పాటు స్వచ్ఛంద సేవకులు భక్తులకు సహాయపడుతూ అన్నదానం విజయవంతంగా నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌చార్జి సీపీ సింధు శర్మ, డీసీపీ బష్వ రెడ్డి జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిక్షణం పరిశీలించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి పల్గుట్ట వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.