తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ట్రక్కులో 500 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ ఈగల్ టీం అప్రమత్తమైంది. ఈ బృందం పట్టు వదలకుండా 1000 కి.మీ. వెంటాడి గంజాయి తరలిస్తున్న ట్రక్కును చాకచక్యంగా పట్టుకుంది.దీపావళి రోజు ఈగల్ బృందం నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈగల్ టీం తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో నుంచి ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి భారీ ఎత్తున గంజాయి సరఫరా కానుందని ఈగల్ టీంకు పక్కా సమాచారం అందింది. ఈ..క్రమంలో ఈగల్ ఖమ్మం రీజినల్ నార్కొటిక్ కంట్రోల్ సెంటర్ (ఆర్ఎన్సీసీ) ఇన్స్పెక్టర్ రామ్కుమార్, ఎస్సై రవిప్రసాద్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు లారీని తరలిస్తారనే సమాచారం రావడంతో అప్రమత్తమైంది. ఏవోబీ సరిహద్దుల్లోకి వెళ్లి పట్టుకోవాలని ఈగల్ పథకం రచించింది.
రాజమహేంద్రవరం నుంచి ఈగల్ టీం ఛేజింగ్..
ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా పరిధిలో నుంచి ట్రక్కు వస్తోందనే సమాచారంతో ఈ నెల 19న ఆ మార్గంలో మాటు వేసింది. రాజమహేంద్రవరం నుంచి ఈగల్ బృందం ఛేజింగ్ ప్రారంభమైంది. అయితే వాహనం అనూహ్యంగా దారి మళ్లించడం, తెలంగాణ మీదుగా కాకుండా బిజూ ఎక్స్ప్రెస్వే మీదుగా పయనించింది. అయినా సరే ఈగల్ బృందం వదలిపెట్టకుండా ఎన్సీబీతో సమన్వయం చేసుకుంటూ లారీని వెంబడించారు. ఈ నెల 21న ఝార్ఖండ్లోని రాంచి-రావుర్కెలా మార్గంలోని సిమ్డేగా వద్ద ట్రక్కును అడ్డుకున్నారు. అందులో రహస్యంగా దాచిన 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ట్రక్కు డ్రైవర్ నసీమ్ కమ్రుద్దీన్(30)ను అరెస్టు చేశారు. అతడిది హరియాణా రాష్ట్రం అని, ఆ రాష్ట్రానికి చెందిన ముస్తాక్ ఖాన్, ఆరిఫ్ ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో ఉంటున్నారని వారికి అప్పగించేందుకే గంజాయిని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తమ బృందం నిద్రాహారాలు మాని ట్రక్కును పట్టుకుందని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు. దీపావళి చేసుకోకున్నా, అంతకుమించిన ఆనందాన్ని దక్కించుకుందని ఆయన ప్రశంసించారు.









