ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్ లో నమోదు చేయాలి.

అవసరమైన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలి.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. దర్యాపూర్ స్కూల్, భవిత కేంద్రాల సందర్శన.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక  నవంబర్ 12 : (నవీన్ కుమార్) ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్ లో విధిగా నమోదు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. యూడైస్ లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్.ఎం హన్మంతరావు తెలుపగా, కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ వివరాలను కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధృవీకరణ పత్రం కోసం బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులు అందరూ దరఖాస్తు.చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే విద్యార్థులకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహసీల్దార్ వెంకటరమణకు సూచించారు. కాగా, ప్రతి విద్యార్థికి సంబంధించి అపార్ జెనరేట్ జరగాలని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ముఖ గుర్తింపు విధానం ద్వారానే వంద శాతం చేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ శత శాతం ఎఫ్.ఆర్. ఎస్ అమలయ్యేలా చూడాలన్నారు. కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపర్చాలని, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న పాత గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.కాగా, పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టాల్సిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంత మేరకు అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులు, నిర్మాణాల ప్రతిపాదనలు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్, భవిత కేంద్రాల జిల్లా ఇంచార్జి ప్రకాష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment