జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి13:

నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం

-పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు వేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జ‌గ‌దీశ్ రెడ్డిని ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార అహంకారానికి నిదర్శనమని ఆయన గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుర్నీతిపై బయట ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని, అసెంబ్లీలో నిలదీస్తే సభ నుంచి గెంటేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డికి మాట్లాడేందుకు అవ‌కాశం, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి మైక్ ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాడేవారి గొంతు నొక్కడమే ఇందిరమ్మ రాజ్యమా? అని జీవన్ రెడ్డి నిలదీశారు. స‌భ‌లో మాట్లాడేందుకు అవ‌కాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ బండారం బయట పడుతుందనే భయంతోనే ఇలాంటి అక్రమ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కింది బీఆర్ఎస్ సభ్యుల గొంతు కాదని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో పోరాడుతామని ఆయన తెలిపారు.

ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్దం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను నిరసించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!