జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ వి. భుజంగరావుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలని అన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో డైట్ మెనూ పట్టికను విధిగా ప్రదర్శించాలని, ఫుడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, విద్యార్థులను సొంత పిల్లలుగా భావిస్తూ, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు అవసరం ఉన్నట్లయితే, ఈ నెల 20వ తేదీ లోపు వివరాలు సమర్పించాలని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యా సంస్థల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలలో పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం బాధ్యులను ఉపేక్షించబోమని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, లోపాలు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.












