పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పోలీసులు అర్ధరాత్రి దాడులు చేయడం, అక్రమంగా అదుపులోకి తీసుకోవడం, విడుదల కోసం డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలు బాధితుల నుంచి వస్తున్నాయి. అత్యవసర పరిస్థితి అమలు తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని వారు పేర్కొంటున్నారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా వెలువడిన నివేదికలు వెల్లడించాయి. పోలీసులు ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, సరైన కారణాలు లేకుండా అదుపులోకి తీసుకోవడం, విడుదల కోసం డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలను, పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రావిన్స్‌లో గవర్నర్ పాలన, అత్యవసర పరిస్థితిని అమలు చేసిన తర్వాత తమ పరిస్థితులు మరింత దారుణంగా మారాయని బహిష్కరణకు గురై ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి వెళ్లిన పలువురు వ్యక్తులు పేర్కొన్నట్లు టోలో న్యూస్ కథనాన్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది.
ఆఫ్ఘన్ శరణార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు రాత్రివేళల్లో ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు నిర్వహిస్తున్నారని, పగటిపూట మార్కెట్లలోనూ వారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. పని చేసుకునే ప్రదేశాల నుంచి కూడా కొందరిని అదుపులోకి తీసుకున్నారని బాధితులు తెలిపారు. విడుదల కావాలంటే డబ్బులు చెల్లించాలని అడిగేవారని, చెల్లించలేని వారిని నిర్బంధించడం లేదా దేశం నుంచి బహిష్కరించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
మొహమ్మద్ రెహమాన్ అనే ఆఫ్ఘన్ పౌరుడు మాట్లాడుతూ.. గతంలో పంజాబ్ నుంచి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకు మారినప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉండేవని, అయితే అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత బయటకు వెళ్లడమే ప్రమాదకరంగా మారిందని చెప్పినట్లు నివేదిక తెలిపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాల్లో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు.
మరో బాధితుడు సోహైల్ ఖాన్ మాట్లాడుతూ, పోలీసులు రాత్రివేళల్లో ఇళ్లపై దాడులు చేయడంతో పాటు మార్కెట్లలో ఆఫ్ఘన్ శరణార్థులను వేధించి డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. బహిష్కరణకు గురైన మరికొన్ని కుటుంబాలు తమ సామగ్రిని తరలించేటప్పుడు కూడా అధికారులు అనవసరమైన ఇబ్బందులు సృష్టించారని తెలిపారు. ట్రక్కులో పెట్టిన వస్తువులను కిందకు దింపించారని, ఇళ్ల కోసం కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను కూడా తిరిగి దింపాల్సి వచ్చిందని ఓ బాధితుడు వివరించినట్లు కథనం పేర్కొంది.
ఈ పరిణామాలతో శరణార్థుల కుటుంబాల్లో భయాందోళనలు పెరిగాయని నివేదిక తెలిపింది. అరెస్టు అవుతామనే భయంతో సాధారణ పనుల కోసం బయటకు వెళ్లలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు నెలల్లో 27 వేల మంది ఆఫ్ఘనిస్థాన్‌కు తిరుగు ప్రయాణం
గత మూడు నెలల్లోనే తోర్ఖమ్ సరిహద్దు మార్గం ద్వారా సుమారు 27 వేల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి వెళ్లినట్లు నివేదిక పేర్కొంది. తిరిగి వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున తోర్ఖమ్ సమీపంలోని ఒమరి తాత్కాలిక శిబిరంలో ఏర్పాట్లు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. శరణార్థులకు అవసరమైన సేవలు అందించేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.












