నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7(షేక్ గౌస్)
నిజాంసాగర్ మండలం ఆన్సన్ పల్లి గ్రామంలో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం పలువురు సామాజిక, రాజకీయ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మాల దళిత నాయకుడు బంగారు సాయిలు ఆధ్వర్యంలో శేఖ్ హుస్సేన్ (MPJ) మరియు ఇతర నాయకుల బృందం బాధితురాలి వద్దకు వెళ్లి ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దాడి ఘటనపై ఆందోళన
హసన్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాగరి సావిత్రి అనే మహిళపై కుల వివక్షతో దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని కొంత మంది B.C. వర్గానికి చెందిన మహిళలు, ఆమె మంచి నీటివద్ద నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో, “నీవు మాల దానివి” అంటూ కుల వివక్షతో అవమానించారని ఆమె ఆవేదనతో తెలిపింది.
ఆధునిక సమాజంలో కుల వివక్ష – హేయమైన చర్య
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సామాజిక కార్యకర్తలు షేక్ హుస్సేన్, బంగారు సాయిలు కుల వివక్ష ఇంకా సమాజంలో కొనసాగుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు. “సమాజం ఎంత పురోగమించినా, అణగారిన వర్గాలపై వివక్ష కొనసాగుతుండడం దారుణం. ఇటువంటి దురాచారాలను సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానులే” అని అన్నారు.కుల వివక్ష దాడులను ఎదుర్కొనడానికి ప్రజలందరూ కలిసికట్టుగా గళం విప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, సామాజిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను వారు కోరారు.ఈ కార్యక్రమంలో అన్వర్ అలీ, రవి, రాజేందర్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు.









