నందిపేట్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం నందిపేట మండలం లోని పలు కార్యలయల కు ఆకస్మికంగా వేళ్లి, వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. ఒక్కసారిగా కలెక్టర్ రాకతో అధికార యంత్రాంగం కదలికలు ముమ్మరమయ్యాయి.పాఠశాలల తనిఖీ:మొదట ప్రభుత్వ పాఠశాలల్లోకి అడుగుపెట్టి బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానంలో పరిశీలించారు. ఎఫ్ఆర్ఎస్ అమలు 100 శాతం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యత, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా అనే అంశాలను స్వయంగా చెక్ చేశారు.ఆసుపత్రి పరిశీలన: అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు, ఔషధ నిల్వల పరిస్థితిని తెలుసుకున్నారు. గర్భిణీలు స్థానికంగానే ప్రసవాలు చేయించుకునేలా చూడాలని, హై రిస్క్ కేసులు ఉంటే పెద్ద ఆసుపత్రులకు వెంటనే తరలించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. మాతా–శిశు మరణాలు అరికట్టాలంటే పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని సూచించారు.ఎరువుల గోడౌన్, పశువైద్యశాల: రైతుల అవసరాలకు సరిపడేలా ఎరువులు నిల్వ ఉండాలని, మిగిలినప్పుడే కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పశువైద్యశాలలో టీకాలు, కృత్రిమ గర్భధారణ, పశుగ్రాస పంపిణీ అంశాలపై సమీక్ష జరిపారు.ఫైర్ స్టేషన్, నర్సరీ: విపత్తుల సమయంలో ఫైర్ స్టేషన్ తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొత్త భవనం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలో మొక్కల సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ — మిగిలిన మొక్కలను వేగంగా పంపిణీ చేయాలని ఎంపీడీఓకు ఆదేశించారు.రెవెన్యూ, అభివృద్ధి పనులు: తహసీల్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులపై గ్రామాల వారీ సమీక్ష చేసి, పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
నందిపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. శాఖల పనితీరుపై దృష్టి— యంత్రాంగం అలర్ట్
Published On: August 12, 2025 9:08 pm











