బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఓటీపీ నెంబర్ పేరుతో సర్కారు చీటింగ్-ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్లెక్కిన అన్నదాతలు-రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్.
జై భారత్ దినపత్రిక ఆర్మూర్ ఫిబ్రవరి 20 : యూరియా బస్తాల కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిక్కుమాలిన పాలన వల్ల ఇటు షాపులోనూ, అటు యాపులోనూ యూరియా దొరకని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.ఫర్టిలైజర్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని ఆయన అన్నారు.ఓటీపీ నెంబర్ పేరుతో సర్కారు రైతులను చీటింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్మూర్ నియోజక వర్గంలో అన్నదాతలు యూరియా కోసం రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు.నందిపేట్ మండలంలో ఫర్టిలైజర్ యాప్ మోసాలపై మండి పడుతూ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతులు కంటతడి పెడుతున్న దృశ్యాలు చూసి గుండె తరుక్కుపోతోందని ఆయన అన్నారు. తమకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇక తమకు యూరియా దొరికేదెట్లా అని రైతులు వాపోతున్నారని ఆయన తెలిపారు. చదువు రాని, ఫోన్లు వాడటం రాని రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ఆన్లైన్లో బుకింగ్ చేయడం, రైతులకు ఓటీపీలు రాకపోవ డం, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా దొరకక పోవడం వల్ల రైతులు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జీవన్ రెడ్డి వివరించారు. యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఉండడం తాము చేసుకున్న దౌర్భాగ్యం అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. యూరియా యాప్ ను తీసేయాలని, గతంలో ఇచ్చిన విధంగానే యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కారు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో రైతులను గాలికొదిలి ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేయడం, అమరావతి గురువుకు సలాం లు కొడుతూ తిరగడమే రేవంత్ రెడ్డికి నిత్యకృత్యమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.









