తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. దాన్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. ‘‘మీరు ఇచ్చిన గ్యారంటీల్లోని హామీలన్నీ గారడీలేనని అర్థమైంది. రైతుభరోసాను మొదలుపెట్టలేదు. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచలేదు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన కొలువులు 12,527 మాత్రమే. యువతకు ఇస్తామన్న రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయి? ఏకకాలంలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలను క్షమాపణలు కోరాలి. మూసీ సుందరీకరణకు భారాస హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయింది. అయినా ఈ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామనడం మూటల వేటకేనని ఎవర్ని అడిగినా చెబుతారు. కాంగ్రెస్ చర్యలతో బాధితులైనవారు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తుండటంతో తెలంగాణ భవన్ నేడు జనతా గ్యారేజ్‌లా మారింది. మళ్లీ భారాస ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు సచివాలయం వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్‌కు సకల మర్యాదలతో సాగనంపుతాం. ఉద్యమం సందర్భంగా కోట్ల మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి స్వరూపాన్ని అవమానించి.. ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాం తప్ప రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లు మార్చలేదు. ఇందిరా గాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకుంటే మంచిది’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు