నిజామాబాద్ జిల్లాలో అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి నిర్వహించిన అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో అటవీ విస్తీర్ణం, వన్యప్రాణుల సంరక్షణ, చట్టాల అమలు తీరుపై అధికారులకు వివరించారు. సిరికొండ ప్రాంతంలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ విస్తీర్ణం తగ్గకుండా పకడ్బందీ చర్యలు , ఎక్కడా అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా సరిహద్దులు పక్కాగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సరిహద్దు సమస్యలున్న ప్రాంతాల్లో అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, జాయింట్ సర్వే ద్వారా రికార్డులను పరిశీలించి సరిహద్దులను నిర్ధారించాలని ఆదేశించారు. ఆర్ఓఆర్ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు.
అటవీ పరిరక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని, అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


