మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో అరుదైన ఘనత సాధించారు. పోలీస్ కమిషనరేట్లను మినహాయించి, జిల్లాల వారీగా ఫోన్ల రికవరీలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2.23 కోట్ల విలువైన 1,397 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
గత 45 రోజుల్లోనే రూ.42.24 లక్షల విలువైన 264 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. మొబైల్ ఫోన్ల రికవరీ కోసం, ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజుతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రతినెలా సగటున 150కి పైగా మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది సైతం సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. సీఈఐఆర్ () పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 5,678 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.9.08 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ వివరించారు. మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, కీలక సమాచారం ఉంటాయని, ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వ్యక్తిగత భద్రత, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఎస్పీ అభినందించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, సిమ్ కార్డును బ్లాక్ చేయించడంతో పాటు పోర్టల్ ద్వారా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. పోగొట్టుకున్న ఫోన్ ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన ఫోన్లను పొందేందుకు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజును 8712686114 నంబర్లో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

