జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. దేశ సమగ్రత ఐక్యతకోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తి దాయకమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ లో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించి, పటేల్ కు ఘనమైన నివాళి అందించారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా 1948లో భారత సైన్యం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించి, నిజాం లొంగుబాటు ప్రకటించడంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని తెలిపారు. ఈ చారిత్రాత్మక సంఘటనలో పటేల్ పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు తదితరులు పాల్గొన్నారు.

