టాప్ మెరిట్ విద్యార్థులకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ తరపున అవార్డుల ప్రదానం.
ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ‘‘ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయనలా దేశానికి తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉండాలి,’’ అని చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవర్తి రాజశేఖర్ పిలుపునిచ్చారు.ఆర్మూర్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభా విద్యార్థులకు టాపర్‌మెరిట్ అవార్డులు అందజేయడంతో పాటు ఉచిత పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజశేఖర్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. విద్యకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని, సెల్‌ఫోన్‌లకు బానిసలుగా మారకూడదని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్లలో ఏమి చూస్తున్నారో గమనించి, వారి చదువుల పై దృష్టి పెట్టేలా చూడాలని అన్నారు.జమాత్ జిల్లా అధ్యక్షుడు మన్జూర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ, ఖుర్ఆన్‌లో అవతరించిన మొదటి అయత్ ‘ఇక్రా’ (చదవు) అని పేర్కొంటూ, ఇస్లాం దృష్టిలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. సమాజ అభ్యున్నతికి జమాతే ఇస్లామీ హింద్ విద్యను ప్రధానంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో జమాత్ రాష్ట్ర సభ్యుడు ఎం.ఎన్. బైగ్ జహీద్, అస్లాం బిన్ మొహ్సిన్, అబ్దుల్ జబ్బార్, వాజేద్, ఖాలెద్, అబ్దుల్లా, రఫీ తదితరులు పాల్గొన్నారు. అవార్డులు, పుస్తకాలు, బ్యాగులు అందుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు జమాతే ఇస్లామీ హింద్ ఆర్మూర్ కు కృతజ్ఞతలు తెలిపారు.