ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరుల రాజీనామాలు!
రేపు బోధన్ బంద్ కి పిలుపు
బోధన్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పార్టీ వర్గాల్లో అసంతృప్తికి దారి తీసింది. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతుగా ఉన్న 31 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభిన్న పదవులకు రాజీనామా చేశారు.పదవులకు రాజీనామా చేసినవారు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సోమవారం లేఖ పంపించారు. “స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సుదర్శన్ రెడ్డిని మంత్రిగా నియమించకపోతే, బోధన్ నియోజకవర్గంలో పార్టీకి పెనుసవాళ్లు ఎదురవుతాయి,” అని వారు లేఖలో హెచ్చరించారు.ఈ లేఖ బహిర్గతమవడంతో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి పెరిగింది. ముఖ్యంగా రెండో విడత మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లాలో నేతల దృష్టి సుదర్శన్ రెడ్డిపై కేంద్రీకృతమవుతోంది. ఈ పరిణామాలపై పార్టీ ఉన్నత నేతలు త్వరలో సమీక్ష చేయనున్నట్లు సమాచారం.