షాపూర్ మహిళను మాయమాటలతో తీసుకెళ్లి హత్య చేసిన గంగాధర్ అరెస్ట్
నందిపేట్ జై భారత్ జూన్:3( షేక్ గౌస్)నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత (42) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మే 26న జరిగిన ఈ ఘటనపై మృతిరాలు కుమారుడు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసును ఆర్మూర్ రూరల్ సీఐ కే. శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు మంగళవారం నిందితుడిని అరెస్టు చేయడంలో విజయం సాధించాయి.ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:ఆర్మూర్ రూరల్ సి ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు గొల్ల పెద్ద గంగాధర్ (46) ఆలూరు గ్రామానికి చెందినవాడు. మే 26వ తేదీన నందిపేటలో సుమలతతో పరిచయం ఏర్పరచుకున్న గంగాధర్, మాయమాటలు చెప్పి ఆమెను బైక్‌పై ఐలాపూర్ శివారులోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగి గొడవ జరిగింది. తత్ఫలితంగా గంగాధర్ తన టవల్‌తో ఆమె మెడ చుట్టి ఉరి వేసి హత్య చేశాడు.పట్టుబడిన నిందితుడు – ఆధారాల స్వాధీనం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చిట్టాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన బైక్, టవల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.పోలీసుల కృషికి అధికారులు ప్రశంసలు ఈ కేసును వేగంగా ఛేదించిన రూరల్ సీఐ కే. శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ ఎం. చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు సుదర్శన్, అనిల్, అంబర్ సింగ్‌లను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.గతంలో బాల్కొండ మండలంలో ఓ కాంపౌండర్ హత్య కేసును రెండు రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ శ్రీధర్ రెడ్డి, తాజా కేసులోనూ తన దర్యాప్తు నైపుణ్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారు.