ఆర్మూర్ జై భారత్ మే :27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలన లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోన్న స్లాట్ బుకింగ్ విధానంలో ఆర్మూర్ కార్యాలయం ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది.ప్రస్తుతం ఆర్మూర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా సాగుతోంది. పాతకాలపు సంతకం స్థానంలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు వేచి ఉండే అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతోంది. దాంతో ప్రజలకు సులభతరం కాగా, అధికారులు కూడా క్రమబద్ధంగా సేవలు అందిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సబ్ రిజిస్టర్ మహేందర్ రెడి తెలిపిన వివరాల ప్రకారం, రోజుకు సగటున 40 నుంచి 45 డాక్యుమెంట్లు ఎలాంటి అంతరాయం లేకుండా రిజిస్ట్రేషన్ లు అవుతున్నాయి. తాజాగా డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఆన్లైన్ ద్వారా అందిన డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకంతోనే ధృవీకరణ జరగడంతో పని సమయం తగ్గింది. ఈ విధానం ఉద్యోగుల పనిభారం తగ్గించడమే కాకుండా, నాణ్యతలోనూ మెరుగుదల తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. విక్రయదారుని , కొనుగోలు దారుని సంతకాన్ని ఫోర్జరీ చేసే భయం ఉండదు అని ఈ కొత్త విధానంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పనులు వేగంగా పూర్తవడంతో వారు సాంకేతికతకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే విధంగా ఇతర కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని త్వరలో విస్తరించాలని కోరుతున్నారు.
ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభం
Published On: May 27, 2025 6:20 pm
