కాకతీయుల కాలం నాటి చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయంలో పురాతన శిల్పాల పరిరక్షణకు భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ) చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలోని ద్వారపాలకుల శిల్పాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను హైదరాబాద్ సర్కిల్‌కు చెందిన ఏఎస్ఐ అధికారులు న ప్రారంభించారు. శిల్పాల అసలు రూపం, కళాత్మక లక్షణాలు దెబ్బతినకుండా సంప్రదాయ పద్ధతుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ద్వారపాలకుల శిల్పాల పునరుద్ధరణలో సంప్రదాయ శిల్పశాస్త్ర ప్రమాణాలను పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిల్పాల పరిమాణం, భంగిమ, ఆకృతి, చేతుల్లోని ఆయుధాలు, ఇతర ప్రత్యేక లక్షణాలు యథాతథంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న లేదా విరిగిన భాగాలకు మరమ్మతులు అవసరమైన చోట అసలు రాయికి రంగు, ఆకృతి, ధాన్య నిర్మాణం, భౌతిక లక్షణాల్లో దగ్గరగా ఉండే రాయిని ఎంపిక చేసి వినియోగిస్తున్నారు.
పునరుద్ధరణలో భాగంగా దెబ్బతిన్న భాగాలను జాగ్రత్తగా తొలగించడం, రాళ్లు కలిసే ఉపరితలాలను సిద్ధం చేయడం, అవసరమైన భాగాలను ఖచ్చితంగా అమర్చడం, కీళ్లను బలోపేతం చేయడం వంటి పనులు చేపడుతున్నారు. పురాతన శిల్పాలకు మరింత నష్టం కలగకుండా నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
రూ.కోటితో ఆలయ పరిసరాల అభివృద్ధి
శిల్పాల పరిరక్షణతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. పచ్చిక బయళ్ల అభివృద్ధి, మొక్కల పెంపకం, హెడ్జింగ్, నడక మార్గాల మెరుగుదల, ఇతర ఉద్యానవన పనులను చేపడుతున్నారు. ఈ పనులకు సుమారు రూ.కోటి అంచనా వ్యయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సందర్శకులకు ఆలయ ప్రాంగణాన్ని మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నారు.
ఈ పనులకు ఏఎస్ఐ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ పి. కిషోర్ కుమార్ రెడ్డి సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు. సంరక్షణ సహాయకులు మల్లేశ్, అజిత్ కూడా పనుల్లో పాల్గొంటున్నారు. సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ నిహిల్దాస్ ఎన్. పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఏఎస్ఐ చెన్నై విభాగానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు కనియప్పన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు.
దక్షిణ పోర్టికో పునరుద్ధరణ
వెయ్యి స్తంభాల ఆలయంలో మరో దశ పరిరక్షణ పనులను ఏఎస్ఐ ప్రారంభించింది. ఆలయంలో మిగిలిన దక్షిణ పోర్టికో పునరుద్ధరణ, దెబ్బతిన్న రాతి శిల్పాల మరమ్మతులు, ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దక్షిణ పోర్టికోను పునర్నిర్మించడంతో పాటు చారిత్రక నిర్మాణ స్వరూపం దెబ్బతినకుండా పరిసరాలను అభివృద్ధి చేస్తున్నారు.
కాకతీయుల నిర్మాణ, శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయంలో పురాతన శిల్పాలు, స్తంభాలు, మండపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. శతాబ్దాల నాటి ఈ వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపడుతున్న పరిరక్షణ పనులు కీలకంగా మారాయి.
ఆలయ చారిత్రక స్వరూపాన్ని కాపాడుతూ భక్తులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతి కల్పించడమే ఏఎస్ఐ చర్యల ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.










