సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ అరామ్కో నుంచి వెల్స్పన్ కార్ప్ అనుబంధ సంస్థ ఈపీఐసీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. ఉక్కు పైపుల తయారీ, సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందం విలువ సుమారు రూ.2,000 కోట్లు. ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ అరామ్కో నుంచి వెల్స్పన్ కార్ప్ అనుబంధ సంస్థ ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఫర్ ఇండస్ట్రీ (ఈపీఐసీ) భారీ ఆర్డర్ దక్కించుకుంది. ఉక్కు పైపుల తయారీ, సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందం విలువ 771 మిలియన్ సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,000 కోట్లు.
ఒప్పందం ప్రకారం ఈపీఐసీ అరామ్కోకు అవసరమైన ఉక్కు పైపులను తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఆర్డర్ ద్వారా వచ్చే ఆదాయ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం వరకు కంపెనీ ఆర్థిక ఫలితాల్లో కనిపించనుంది.
సౌదీ అరేబియాలో ఈపీఐసీ హెలికల్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డెడ్ పైపుల తయారీలో కీలక సంస్థగా ఉంది. ప్రాంతీయ చమురు, గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులకు ఈ సంస్థ పైపులను సరఫరా చేస్తోంది.
మధ్యప్రాచ్యంలో విస్తరణ
ఈ భారీ ఆర్డర్‌తో పాటు వెల్స్పన్ కార్ప్ మధ్యప్రాచ్యంలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లోని సంస్థ ద్వారా జోర్డాన్‌లో కొత్త తయారీ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
ప్రతిపాదిత వెల్స్పన్ పైప్ జోర్డాన్ ద్వారా ఇనుము, ఉక్కు వైర్లు, ట్యూబులు, పైపులు, ఆయిల్, గ్యాస్, నీటి రవాణాకు ఉపయోగించే లైన్ పైపుల తయారీ, ప్రాసెసింగ్, ఫ్యాబ్రికేషన్ చేపట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, వెల్స్పన్ కార్ప్‌కు ఇటీవల అమెరికా తయారీ కేంద్రం నుంచి పైపుల సరఫరాకు 1.8 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద ఆర్డర్ కూడా లభించింది. దీంతో సంస్థ ఆర్డర్ బుక్ గణనీయంగా పెరిగింది.








