వేల్పూరు (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 06
మానవ జీవితంలో గురువు పాత్ర అత్యంత కీలకమని, భవ బంధాల నుండి విముక్తి కలిగించి ఆత్మసాక్షాత్కారానికి మార్గం చూపుతారని బెంగళూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నారు. వేల్పూరులోని శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమములో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
వేల్పూరు శివారులో గల శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమములో గురువారం సాయిబాబా గర్భాలయంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవుడి భవ బంధాల నుండి విముక్తుడిని చేసి ఆత్మసాక్షాత్కార దిశగా నడిపించడంలో గురువు పాత్ర అసమానమైనదని, అత్యున్నతమైనదని అన్నారు. గురువులు శిష్యుల ఉద్ధరణనే ధ్యేయంగా జీవిస్తారని, గ్రంథాల ద్వారా దొరకని గూడమైన సత్యాలను అనుభవ పూర్వకంగా వివరిస్తారని తెలిపారు. సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను, భయాలను తొలగించి ధైర్యాన్ని నింపుతారని, తద్వారా ముక్తి మార్గం సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
భక్తితో భజనలు, పల్లకి సేవ
ఆధ్యాత్మికవేత్త రాఘవేంద్ర స్వామి ప్రవచనం అనంతరం ధ్యాన మందిరంలో భజన కళాకారులు భజనలు నిర్వహించారు. అనంతరం, ప్రాంగణం చుట్టూ పల్లకి సేవను నిర్వహించారు. గజ్జెలు గల్లు గల్లునా మువ్వలు మెల్లే మెల్లేనా, రారా కన్నయ్య మా ఇంటికి అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ పల్లకి సేవలో భక్తులు తరించారు.
అన్నదానం, సన్మానం
గోవింద్ పేటకు చెందిన గెంటేల లక్ష్మీ ఒడ్డెన్న దంపతులు యోగాశ్రమంలో అన్నదానం చేశారు. అన్నదాతలకు ఆలయ అర్చకులు ప్రవీణ్ కుమార్ పంతులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అన్నదాతలను శాలువా కప్పి సన్మానించారు.
కార్యక్రమములో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో యోగాశ్రమ కమిటీ సభ్యులు, సాయి భక్తులు, సాయి సేవకులు, తదితరులు పాల్గొన్నారు.











