గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఒకే పింఛన్ ఎందుకు.. మేము అధికారంలోకి వస్తే రెండు పింఛన్లు ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీని నెరవేర్చకుండా వృద్ధులను నిరాశపరిచింది. చేయూత పథకం కింద ఇచ్చే పింఛన్లలో వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
కొత్త పింఛన్ల ప్రకటన
ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తలసేమియా, డయాలసిస్ రోగుల కోసం కొత్త దరఖాస్తు నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 31 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి గడువు విధించింది.
వృద్ధాప్య పింఛన్లకు మొండిచేయి
అయితే, ఈ ప్రక్రియలో వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను మాత్రం స్వీకరించడం లేదు. ఇది వృద్ధులలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులను కూడా స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ, షహీద్ డిమాండ్ చేశారు.




