సిరికొండ, 2 September
మాదిగల హక్కుల సాధనతో పాటు సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరికొండలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల స్థాయి సదస్సు నిర్వహించి, నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మాదిగల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం సిరికొండలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక సిరికొండ, సెప్టెంబర్ 2: మాదిగల హక్కుల సాధనతో పాటు సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సిరికొండ మండల కేంద్రంలోని కేజీ దాస్ ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల స్థాయి సదస్సును బుధవారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ సిరికొండ మండల ఇన్చార్జి మొట్టల దీపక్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ, విశిష్ట అతిథులుగా ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి గంధమల నాగభూషణం మాదిగ, కో-ఇన్చార్జి చెవురి శ్యామ్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాసాయిపేట యాదగిరి మాదిగ మాట్లాడుతూ సమాజంలో మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. మాదిగల హక్కుల సాధనతో పాటు ఎస్సీ వర్గీకరణ ఫలాల పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో సంఘాన్ని విస్తరించి, మాదిగల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో సిరికొండ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మండలంలోని ప్రతి గ్రామంలో సంఘాన్ని మరింత పటిష్టం చేసి, మాదిగల హక్కుల సాధనతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నూతన మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












