మండలం పరిధిలోని డమర, చిన్న భీంపురం గ్రామాలలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు.
ముఖలింగాపురం పంచాయతీ డమర గ్రామానికి చెందిన గంగువాడ నాగరాజు కుమారుడు విశాల్, జన్ని రాము కుమారుడు దిలీప్ కుటుంబ సభ్యులను, అలాగే మేఘవరం పంచాయతీ చిన్న భీంపురం గ్రామానికి చెందిన రైలు ప్రమాద మృతుడు జన్ని శరత్ కుమార్ కుటుంబ సభ్యులను ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్ కలిసి ఓదార్చారు.
ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, నలుగురు విద్యార్థులు మృతి చెందడం, మరొకరు తీవ్రంగా గాయపడటం పేద గిరిజన కుటుంబాలకు తీరని విషాదమని అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో, సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించలేదని కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల కుటుంబాల పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలిగిందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










