పారదర్శకమైన ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేశారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో యూరియా విక్రయాలన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయని, దీనివల్ల అవకతవకలకు తావులేకుండా పంపిణీ జరుగుతోందని ఆమె తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో జిల్లాకు అవసరమైన 80,857 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను, 38,766 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే సమయానికి 13,995 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అమ్మకం జరిగింది.
ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా 1,46,393 మంది రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 17,695 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను కేటాయిస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.
సొసైటీలు, వివిధ సంస్థలు, ప్రైవేట్ డీలర్లతో పాటు జిల్లాలోని 106 రైతు వేదికల ద్వారా కూడా ఎరువుల విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ యాప్ ద్వారా ఏ డీలర్ వద్ద, ఏ సొసైటీలో ఎంత యూరియా అందుబాటులో ఉందో రైతులు తెలుసుకునే వీలుంది. సమీప డీలర్ల వద్ద లేదా సొసైటీ సేల్ పాయింట్ల నుండి సాగు విస్తీర్ణానికి అవసరమైన యూరియాను ముందుగా బుక్ చేసుకుని, 24 గంటల్లోపు బుకింగ్ ఐడితో కొనుగోలు చేసుకోవచ్చు.
ఆధార్ ధ్రువీకరణతో పాటు భూమి యజమాని వివరాలు నమోదు చేసి కౌలు రైతులు కూడా యూరియా బుక్ చేసుకోవచ్చు. పట్టా పాస్బుక్ లేని రైతులు తమ ఆధీనంలో ఉన్న సాగు భూమి వివరాలను మండల వ్యవసాయ అధికారికి సమర్పించి యూరియా బుక్ చేసుకోవచ్చు. తొలి విడత కొనుగోలు చేసిన రైతులు పక్షం రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.









