నిజామాబాద్, జూలై 13
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో తక్షణమే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో తక్షణమే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసి, జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావును కలసి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ ఒక సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.
ప్రస్తుత వర్షాకాలం సీజన్ ప్రారంభమై ఇంతకాలమవుతున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇందూరు జిల్లా వ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దినేష్ కులాచారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే రైతులు అప్పులు తెచ్చి మరీ లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసినప్పటికీ, వరుణుడి కరుణ లేకపోవడం ఒకవైపు, ప్రాజెక్టుల నుంచి సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పచ్చని పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా జిల్లాలోని ప్రధాన వ్యవసాయ హబ్‌లుగా ఉన్న బాన్సువాడ, బోధన్ వంటి కీలక ప్రాంతాల్లో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి వరి సాగు చేపట్టినప్పటికీ, ప్రస్తుత నీటి కొరత కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని ఆయన నివేదించారు. జిల్లాలోని అనేక మెట్ట ప్రాంతాల్లో రైతులు కేవలం బోర్ బావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరమని దినేష్ కులాచారి విమర్శించారు. రైతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలోకి దిగి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు, అలాగే శ్రీరాంసాగర్ (ఎస్సార్ఎస్పీ) ప్రాజెక్టులోని నీటి లభ్యతను శాస్త్రీయంగా దృష్టిలో ఉంచుకుని సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను బహిరంగంగా ప్రకటించాలని ఆయన కోరారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో ఉన్న నీటి నిల్వల నుంచి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఏ మేరకు, ఏ రోజు నుండి సాగునీరు విడుదల చేస్తారో రైతులకు ముందే స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే జిల్లాలో పంటల పరిస్థితిపై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్నదాతలు అధైర్యపడి ఆందోళన చెందకుండా వారికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించి అండగా నిలవాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతులు పాల్గొన్నారు.











