నిజామాబాద్ నగరంలో స్టేడియం నిర్మాణం ఓ కలనేనా? నిరీక్షణే దిక్కా?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రీడాకారులు ఉన్నా… పట్టణానికి మాత్రం సరైన వేదికలు లేవు! పరిమిత మైదానాలు, పాతబడ్డ వసతులు – ప్రొఫెషనల్ శిక్షణకు అడ్డుగోడలు!

( ప్రత్యేక కథనం – నిజామాబాద్ ప్రతినిధి)

నిజామాబాద్ పట్టణం నుంచి ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటిన అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన క్రీడాకారులు నిఖిత్ జరీన్, ఇర్ఫాన్ వుషు,  హుస్సాం ఉద్దీన్, ఎండల సౌందర్య, మరి ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు  డీఎస్ఏ మైదానంలో ఓనమాలు నేర్చుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఇలాంటి మైదానాన్ని హంగులతో నూతనంగా నిర్మిస్తామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారిన ఇప్పటిదాకా ఫలితం మాత్రం శూన్యం. కానీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన  ఈ పట్టణం వారికి తగిన వేదికలు ఇవ్వడంలో ప్రభుత్వం  పూర్తిగా విఫలమైంది. క్రీడల అభివృద్ధిపై ఆసక్తి లేదో… లేక ప్రణాళికే లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది.పెద్దవారెవరికీ పట్టించుకోవలసిన అవసరం అనిపించడం లేదు. గుమస్తా కాలనీ, ఓల్డ్ బాయ్స్ గ్రౌండ్‌లు వంటి కొన్ని మైదానాలే ఇప్పటికీ ఆధారంగా ఉన్నాయి. ఇవి కూడా శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా యువతను తలదించుకునేలా చేస్తున్నాయి.మరోవైపు మినీ స్టేడియం నిర్మాణానికి చేసిన ప్రయత్నం కూడా మధ్యలోనే ఆగిపోయింది. నిధులు మంజూరు చేసినా, పనులు మాత్రం ముందుకెళ్ల లేకపోయాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అసహకారం వల్ల లక్షలాది యువత కలలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

రాష్ట్ర స్థాయిలో ‘స్పోర్ట్స్ పాలసీ’ ఉందా? ఉంటే అమలు ఎక్కడ?…జిల్లా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ ఎందుకు ఉండకూడదు?
ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి – యువత కోసం, భవిష్యత్తు కోసం ప్రతి పట్టణంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలి.యువ క్రీడాకారులకు ఉచిత శిక్షణ, డైట్, యూనిఫాం, మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి.ప్రతిభావంతుల పేరుతో స్పోర్ట్స్ అకాడెమీలు నెలకొల్పాలి.గ్రామీణ స్థాయిలో తరచూ పోటీలు నిర్వహించాలి.బాల , బాలికల క్రీడా ప్రోత్సాహానికి ప్రత్యేక ఫోకస్ ఇవ్వాలి,ఆటలు ఆటలుగానే ఉండవు… అవి ఒక జీవితపు పాఠశాల”నిజామాబాద్‌ యువతకు నైపుణ్యం ఉంది… ఆకాంక్ష ఉంది… గెలవాలన్న తపన ఉంది. ఇప్పుడు కావాల్సింది… ఓ అవకాశం, ఓ వేదిక. ఈ తరానికి అందని వనరులు, రేపటి తరం మళ్లీ కోరుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలి.ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీలు ఇప్పుడు స్పందించాలి.స్టేడియాన్ని కలగా కాకుండా… వాస్తవంగా మార్చే దిశగా అడుగులు వేయాలి!

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!