నందిపేట్ జై భారత్ మే:23, ( షేక్ గౌస్) నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి రోడ్డును రిపేర్ చేశారు. కానీ ఈ ఏడాది వర్షా కాలం రాకముందే వర్షాలు పడడం వలన మళ్లీ గుంతలు ఏర్పడి, రోడ్ పూర్తిగా దెబ్బతింది.ప్రతిరోజూ వందలాది మంది ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయితే ఇప్పుడు రోడ్డంతా గుంతలతో నిండి ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ పూర్తిగా పగిలిపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది.వర్షాకాలం నాటికి ఈ రహదారిని మరమ్మతు చేయకపోతే గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.స్థానికులు స్పందిస్తూ, “ఒకట్రెండు రోజులు కాదు… గత ఏడాది నుంచి ఇదే పరిస్థితి. ప్రతీసారీ తాత్కాలిక చర్యలతో తప్పించుకుంటున్నారు. శాశ్వతంగా డాంబర్ రోడ్ వేయాలి. అప్పుడే ప్రజలకు ఊరట కలుగుతుంది,” అని మాజీ వర్డ్ సభ్యుడు బోగ రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి నాణ్యమైన డాంబర్ రోడ్డును మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.